ఖమ్మం, జూలై 11: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చేగొమ్మ గ్రామం తీవ్ర సమస్యల వలయంలో చిక్కుకుందని, గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం గ్రామ కార్యదర్శి ఉన్నం హరినాథ్ బాబు విమర్శించారు. గ్రామంలో ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించడం లేదని, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేగొమ్మ గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు నిధులు లేవనే సాకుతో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని హరినాథ్ బాబు ఆరోపించారు. గ్రామంలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చాలా కాలంగా పనిచేయడం లేదని, దీని వల్ల చిల్లర దొంగతనాలు పెరిగిపోయాయని తెలిపారు. పీర్ల చావిడిలో పీర్లు, దేవాలయంలో గుడి గంటలు కూడా దొంగల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అనేక మంది గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని, వాట్సాప్ గ్రూపుల్లో ప్రస్తావిస్తే నిధులు లేవని, సీసీ కెమెరా రిపేర్లకు రూ. 50 వేలకు పైగా ఖర్చవుతాయని, తాము ఇస్తారా అంటూ పంచాయతీ సిబ్బంది ఎదురు ప్రశ్నించడం గమనార్హమని పేర్కొన్నారు.
గ్రామంలో మంచి నీటి సరఫరా సరిగా లేదని, అడపాదడపా సరఫరా చేసినా నాలుగు బిందెలకు మించి రావట్లేదని ప్రజలు వాపోతున్నారు. పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ తిరగడం ఎప్పుడో బంద్ అయిందని తెలిపారు. అనేక వీధుల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, నిధులు లేమి సాకుతో పంచాయతీ సిబ్బంది కూడా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. "చావుకు, పెండ్లికి ఒకటే మంత్రం" అన్నట్లుగా అన్నింటికీ నిధులు లేవని, తాము ఏమీ చేయలేమని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారనే సంగతే గ్రామస్థులు మరిచిపోయినట్లుందని హరినాథ్ బాబు ఎద్దేవా చేశారు.
గత మార్చి నెల నుండి సర్పంచ్ లేకపోవడం, ప్రత్యేక అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి చేతుల్లో స్థానిక పరిపాలన సాగడం, పైగా నిధులలో కోత పడటంతో కార్యదర్శికి ఇది కలిసి వచ్చిన అవకాశంగా ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఉన్నం హరినాథ్ బాబు అన్నారు. ఇప్పటికైనా చేగొమ్మ గ్రామంలో ప్రజా సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించి, కనీస అవసరాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు.