మనందరిని రక్షించే తల్లికి మర్యాద పూర్వకంగా వందనం సమర్పణ చేయ్యడమే బోనం అందరిని కలరా మశూచి సకల రోగాలనుండి రక్షించే తల్లికి నివేదన చేయ్యడమే బోనం
"బోనం అంటే భోజనం.
అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం !"
అమ్మకు మాత్రం ఆకలిదప్పులుండవా! అందువల్ల ఆమెను కన్నకొడుకుల్లా, కడుపులో పుట్టిన సంతానం కనిపెట్టుకొని, కడుపు నిండా పెట్టాలి కదా, కాబట్టి బోనాల పండగ పేర ప్రతి ఆషాడంలో అమ్మతల్లికి జాతరలు జరుపుతుంటారు.
మరి ఆషాడ మాసమే ఎందుకంటే, వర్షాలు కురిసి వ్యాధులు విజృంబిస్తాయి. మరోవైపు గ్రామీణులు వ్యవసాయం మొదలు పెట్టేది ఇప్పుడే. అందుకే, తమ పిల్లా పాపా గొడ్డు గోదా, పాడి పంటా, చల్లగా కాపాడుతల్లీ అంటూ మొక్కులు తీర్చుకుంటారు.
అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం (భోనం) అత్యంత భక్తి శ్రద్ధలతో, ఊరేగింపుగా ఉరుమ్మడిగా కలిసి వెళ్ళి ఊరి బయట గల గ్రామ దేవతలకు సమర్పిస్తారు.
ఆషాడమాసం వర్షాలు విరివిగా కురవడం మూలాన క్రిమికీటకాలు, వైరస్ ద్వారా అంటు వ్యాధులు వ్యాపించి జన నష్టం కలగజేస్తాయి. పూర్వకాలంలో వైద్యవిజ్ఞాన శాస్త్రం పరిణతి చెందక ప్రచారం కాని కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి, వంటి అంటు వ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారిపోయేవి. ప్రకృతి బీభత్సాన్ని జయించి వాటిని నివారించుకునే నిమిత్తం భక్తిభావంతో గ్రామదేవతలను ప్రతిష్టించుకొని విశ్వాసంతో ఆరాధించడం మొదలు పెట్టారు. దీనినే శక్తి ఆరాధన, ప్రకృతి ఆరాధన,
గ్రామ దేవతల ఆరాధన అంటారు.
బోనాల ఉత్సవాల్లో కేవలం సంప్రదాయమే కాకుండా భక్తి, విశ్వాసం, శాస్త్రీయ దృక్పథం కూడా దాగి ఉన్నాయి. ఆషాడమాసంలో ఎక్కువగా కురిసే వర్షాల వల్ల వచ్చే అంటు రోగాల నివారణకై క్రిమి కీటకాలను, వైరస్ లను నశింపజేసే వేపాకు, పసుపు, నిమ్మకాయలు, కుంకుమ, గుగ్గిలం, సాంబ్రాణి, అగరువత్తులు, కర్పూరం, కొబ్బరి కాయలు మొదలగు పదార్థాలను తమ పూజా విధానంలో వాడుతారు. అందరిని సదా కాపాడుతల్లి అని వేడుకుందాం.