తమిళనాడులో మంగళవారం (జూలై 8, 2025) నాడు ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే గేటు దాటుతున్న ఒక స్కూల్ బస్సును రైలు ఢీకొనడంతో ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద వివరాలు
ఈ ఘటన ఉదయం 7:45 నిమిషాలకు కడలూరు జిల్లాలోని సెమ్మంగుప్పం సమీపంలో, కడలూరు-ఆలప్పాక్కం స్టేషన్ల మధ్య జరిగింది. 56813 నంబరు గల విల్లుపురం-మైలాడుథురై ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి రైల్వే గేటు దాటుతున్న స్కూల్ బస్సును ఢీకొట్టింది.
ఈ ఢీకొనడంతో బస్సు పూర్తిగా తుక్కుతుక్కు అయి, కొన్ని మీటర్ల దూరం ఎగిరిపడింది. ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది మ్యాన్\u200cడ్ లెవెల్ క్రాసింగ్ అని, చెన్నై-తంజావూరు మెయిన్ ట్రాక్\u200cలో ఉందని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో చెన్నై నుంచి కడలూరు మీదుగా ప్రతిరోజు సుమారు 15 రైళ్లు నడుస్తాయి. ఇది రద్దీగా ఉండే లెవల్ క్రాసింగ్.
గేట్\u200c కీపర్, డ్రైవర్ల నిర్లక్ష్యం?
ప్రతిరోజు స్కూల్ బస్సులు సహా అనేక వాహనాలు ఈ గేట్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, సరకు రవాణా వాహనాలు వందల సంఖ్యలో దీని మీదుగా తిరుగుతుంటాయి. రైలు వచ్చే సమయాల్లో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటారు.
అయితే, ఈ ఉదయం స్కూల్ బస్సు రైల్వే గేటు వద్దకు చేరుకోగానే ప్యాసింజర్ రైలు వస్తున్న సమాచారం గేట్ కీపర్\u200cకు అందింది. అతను గేటును మూసివేయడానికి ప్రయత్నించాడు. కానీ, స్కూల్ బస్సు డ్రైవర్ ఆలస్యమైందని, బస్సును వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని గేట్ కీపర్\u200cను బతిమాలినట్లు సమాచారం. దీంతో గేట్ కీపర్ బస్సును పట్టాలు దాటడానికి అనుమతించాడు.
పట్టాలు దాటుతున్న సమయంలోనే ఈ ప్యాసింజర్ రైలు బస్సును బలంగా ఢీకొట్టి, కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మరణించారు. సుమారు 10 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
సహాయక చర్యలు
బస్సును రైలు ఢీకొనడం చూసిన వెంటనే స్థానికులు, వాహనదారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో చిక్కుకున్న పిల్లలను బయటికి తీశారు. అంబులెన్స్\u200c, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.