ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న దోమల బెడద సమస్యపై స్థానిక కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్పందించారు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, కార్పొరేటర్ గారు ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణకు ఎల్లమ్మ చెరువులో MLO ఆయిల్ బాల్స్‌ను వేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఆయిల్ బాల్స్ వేయడం వల్ల దోమలు లార్వా దశలోనే చనిపోతాయని, తద్వారా వాటి వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి ఒకసారైనా తమ ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వలను తొలగించాలని సూచించారు. ఇంటి వద్దకు వచ్చే ఎంటమాలజీ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
చెత్తను రోడ్లపైనా, కాలువల్లోనూ వేయకుండా, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. ప్రగతి నగర్ నుండి వస్తున్న డ్రైనేజీ నీరు ఎల్లమ్మ చెరువులో కలవకుండా దారి మళ్లించేందుకు పైప్‌లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని కార్పొరేటర్ వివరించారు. ఈ పైప్‌లైన్ నిర్మాణం పూర్తయితే చెరువులో డ్రైనేజీ నీరు చేరదని, తద్వారా చెరువు నీరు శుభ్రంగా మారి, గుర్రపుడెక్క పెరగడం, దుర్వాసన, దోమల బెడద వంటి సమస్యలు తొలగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి. నరసింహులు, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.