Thursday, August 7, 2025

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హైకోర్టు అడ్వకేట్ మారగాని శ్రీనివాస్ గౌడ్‌కు డాక్టరేట్

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హైకోర్టు అడ్వకేట్ మారగాని శ్రీనివాస్ గౌడ్‌కు డాక్టరేట్
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ మారగాని శ్రీనివాస్ గౌడ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) నుంచి ఆయనకు డాక్టరేట్ లభించింది. "ఎ స్టడీ ఆన్ సర్వీస్ క్వాలిటీ అసెస్‌మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్" అనే అంశంపై ఆయన చేసిన లోతైన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన మారగాని రోశయ్య గౌడ్, నాగమ్మల కుమారుడైన శ్రీనివాస్ గౌడ్ విద్యా ప్రస్థానం అసాధారణమైనది. ఆయన చైతన్య పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం సూర్యాపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, హైదరాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ, పీజీ పట్టాలను పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి కూడా పూర్తి చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ పి.వెంకటయ్య పర్యవేక్షణలో శ్రీనివాస్ గౌడ్ తన పీహెచ్‌డీ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరిశోధన సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ వెంకటయ్య పేర్కొన్నారు.
గతంలో శ్రీనివాస్ గౌడ్ సాధించిన మరో ఘనత కూడా ఉంది. ఆయన తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించి, అప్పటి గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ చేతుల మీదుగా అందుకున్నారు.
శ్రీనివాస్ గౌడ్ సాధించిన ఈ విజయాలకు ప్రొఫెసర్ పి.వెంకటయ్య, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక బృందం, పరిశోధక విద్యార్థులు, అలాగే హుజూర్‌నగర్ ప్రాంత వాసులు మరియు మిత్రులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ డాక్టరేట్ ఆయన బహుముఖ ప్రజ్ఞకు, నిరంతర కృషికి నిదర్శనం.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త